: పేదలతో అధికారుల బంతాట
- ఇప్పటికే రూ.25 లక్షల నష్టం
దరఖాస్తు ప్రతి కోసం జిరాక్స్ సెంటర్‌లో పడిగాపులు.. కిలోమీటర్ పొడవునా క్యూలైన్లు.. ఎన్నో వ్యయ ప్రయాసలు.. వెరసి చివరికి దరఖాస్తును అధికారి చేతిలో పెట్టారు. ఇలా వేలాది మంది దగ్గర దరఖాస్తులు స్వీకరించిన రంగారెడ్డి జిల్లా అధికారగణం తిరిగి ఆన్‌లైన్ అప్లికేషన్లను ఆహ్వానించారు. దీంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వేలాది మంది డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్న తరువాత మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమతో బంతాట ఆడుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ దరఖాస్తులను కలెక్టరేట్‌లో గుట్టలుగా పేర్చారు. హైదరాబాద్‌కు చెందిన వారూ సుమారు 30వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. రెండు జిల్లాల్లో ఈ లెక్కన చూస్తే దరఖాస్తులు లక్షన్నర దాటినట్టు తెలుస్తున్నది.
విధివిధానాలు రూపొందించని ప్రభుత్వం
లక్ష డబుల్ బెడ్‌రూమ్‌ల ఇండ్ల విషయమై ప్రభుత్వం జీవో జారీ చేయకపోయినా, లబ్దిదారుల ఎంపికకు విధివిధానాలు రూపొందించకున్నా వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 24 నియోజకవర్గాలున్నాయి. సీఎం ప్రకటించిన లక్ష ఇండ్లను పంచితే ఒక్క నియోజకవర్గానికి 4,500 ఇండ్లైనా రావు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 2,400 ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. లక్ష ఇండ్ల ప్రస్తావనే రాలేదు. మంజూరైన ఇండ్లకూ లబ్దిదారుల ఎంపికే జరగలేదు. ఇండ్లు కట్టించి లబ్దిదారులను ఎంపిక చేస్తారా? లేక లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లు కట్టిస్తారా? అన్న విషయం తేల్చాల్సి ఉంది. ఇప్పటి వరకూ రంగారెడ్డి జిల్లాలో మురికవాడల ఎంపికే జరగలేదు. మొదటి దశలో మురికివాడల్లో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఐదు మురికివాడలను మాత్రమే గుర్తించారు. కూకట్‌పల్లిలో రెండు చోట్ల, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్‌లలో శంకుస్థాపన చేశారు. ఈ మురికివాడలకు మంజూరైంది 2,400 ఇండ్లు మాత్రమే.
గందరగోళ నిర్ణయాలతో ప్రజల అవస్థలు
రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం వహించడం వల్లే దరఖాస్తుదారులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. సమగ్ర ప్రణాళిక లేకపోవడంతో రూపొందించిన అప్లికేషన్లను 10 రూపాయలకు ఒకటి చొప్పున కొని, దానికి ఆధార్‌కార్డు, ఆహారభద్రతా కార్డు, తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామన్న వివరాలను జతపరుస్తూ సుమారు లక్షన్నరకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది అక్కడ బ్రోకర్ల మాదిరిగా తయారై ఫారమ్‌లు నింపి ఇచ్చినందుకు 10 రూపాయల చొప్పున వసూలు చేశారు. దరఖాస్తుదారుల్లో 80 శాతం వరకూ మహిళలే ఉన్నారు. ఒక్కొక్క దరఖాస్తుకు సగటున 25 రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. ఈ ప్రకారం కనీసం దరఖాస్తుదారులు కనీసం రూ.25 లక్షలు ఖర్చు చేసినట్టు అంచనా. విధిలేని పరిస్థితుల్లో జిల్లా సిబ్బంది ఈ దరఖాస్తులను స్వీకరించి, రశీదులనూ ఇచ్చింది. ఇన్ని దరఖాస్తులను స్వీకరించిన యంత్రాంగం వాటికి ఏ విధంగా జవాబుదారీగా ఉంటుందో తెలియని పరిస్థితి.
మినీ మేడారం జాతర...
గత వారమంతా కలెక్టరేట్ మినీ మేడారం జాతరను తలపించింది. వేలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు 7,500 దరఖాస్తులు, ఎన్నికలు ముగిసిన తరువాత 2,900, ఈ నెల 15వ తేదీ నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్లికేషన్లు వచ్చాయి. 15న 6,900, 16న 6,615, 17న 10,040, 18న 13,840, 19న 21,078, 20న 17,201 దరఖాస్తులు కుప్పలుగా చేరాయి. ఆరు రోజుల కాలంలోనే 75,674 దరఖాస్తులు ఇచ్చారు. ఇక్కడ జనాలను చూసి దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన జనం కొంతమంది వెనుదిరిగారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేదాకా ఎవరూ దరఖాస్తు చేసుకోవద్దని, కలెక్టరేట్ కార్యాలయానికి రావొద్దని అధికారులు వారించినా ప్రజలు వినిపించుకోలేదు. 10 రోజులుగా దరఖాస్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చివరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. వేలాది మందిని నియంత్రించలేక ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో 15 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజలకు అర్థం చేయించడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. దరఖాస్తులు తీసుకోవడం మానేస్తే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇప్పుడేమో మళ్లీ రూ.25 చెల్లించి సోమవారం నుండి ఈ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోమని చెబుతోంది.
No comments:
Post a Comment